సాక్షి, అమరావతి: చంద్రబాబు స్వార్థ ప్రయోజనాలకు నిలయంగా మండలి మారిందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన విధానాలు వలనే మండలి అప్రతిష్ట పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం బిల్లును తెస్తే మండలిలో టీడీపీ అడ్డుకుందని నిప్పులు చెరిగారు. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి వికేంద్రీకరణ బిల్లును కూడా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
పాదయాత్రలో ప్రాంతాల మధ్య అసమానతలను సీఎం వైఎస్ జగన్ గుర్తించారని చెప్పారు. హైదరాబాద్ లాంటి ఉదాహరణతో వికేంద్రీకరణ జరగాలని ఆయన నిర్ణయించారన్నారు. పాక్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులను విడిపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ సంకల్పమని తెలిపారు. మండలి రద్దు తీర్మానాన్ని బలపరుస్తున్నానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని మోపిదేవి తెలిపారు.